- మన పొనుగుపాడు – తెలుగు భూమి - https://www.manaponugupadu.com -

తలారిచెరువు గ్రామస్తుల వింతఆచారం

తలారిచెరువు గ్రామస్తులు వింత ఆచారం

అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలం లోని తలారిచెరువు గ్రామస్తులు పూర్వీకుల నుండి ఒక వింత ఆచారాన్ని పాటిస్తారు.ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమికి ముందు రోజు అర్ధరాత్రి నుండి విద్యుత్ సరఫరా నిలిపివేసి, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా, పశు పక్షాదులను వదలి ఇండ్లకు తాళాలువేసి అందరూ గ్రామం నుండి ఖాళీ చేసి, గ్రామానికి సమీపంలోని దర్గా వద్దకు చేరుకుంటారు.ఇలా చేరుకోవటాన్ని వారు ‘అగ్గిపాడు’ గా పేర్కొంటారు. అక్కడే వంటచేసుకుంటారు. తిరిగి అదే రోజు రాత్రి అందరూ 7 గం.లకు గ్రామానికి బయలుదేరి, దీపంకూడా వెలిగించకుండా ఆరుబయటే భోజనాలు చేసి, రాత్రి తిరిగి 12.గం.లకు విద్యుత్ సరఫరా వచ్చినాక, గుమ్మానికి కొబ్బరికాయ కొట్టి ఇండ్లలోకి ప్రవేశిస్తారు.కొన్ని వందల సంవత్సరాల నుండి వస్తున్న ఈ వింత ఆచారం వెనుక నిగూడ రహస్యం దాగి ఉందని తెలుస్తుంది. ఐదారు వందల సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి ఒక బ్రాహ్మణుడు తన మందితో చొరబడి, పండిన పంటలు దోచుకుపోతుంటే, గ్రామస్థులు అందరూ ఏకమై అతనిని మాటువేసి హతమార్చినట్లు, అప్పటి నుండి గ్రామాభివృద్ధి క్షీణించిందని, పశుపక్షాదులకు, మగశిశువులకు అకాల మరణాలు సంభవిస్తున్నాయని అనే నమ్మకంతో, బ్రాహ్మణ హత్య మహాపాతకం అని భావించి, గ్రామ పెద్దలు కొంత మందిని సంప్రదించగా, అందుకు వారు పరిహారంగా ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమి రోజు గ్రామం వదలి బయట గడపాలని సూచించగా, అప్పటినుండి ఈ ఆచారం పాటిస్తే గ్రామానికి పట్టిన కీడు వైదొలగి గ్రామం సుభిక్షంగా ఉంటుందని అనే నమ్మకంతో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగించటం విశేషం.

మూలం:ఈనాడు నెట్ 2019 అక్టోబరు 8 తెలుగు వికీపీడియా నుండి సేకరణ