- మన పొనుగుపాడు – తెలుగు భూమి - https://www.manaponugupadu.com -

మన దేశంలో చదువుల దుర్గతి. – ఏం చేద్దాం?

మన దేశంలో చదువుల దుర్గతి. – ఏం చేద్దాం?

ప్రపంచ బ్యాంకు చెప్పింది. “దక్షిణ ఆసియాలో చదువులు అధ్వాన్నం. ఇండియా, పాకిస్థాన్ లలో మరీ ఘోరం. పాఠాలు చెప్పే మాష్టర్లుకు వారి విద్యార్థుల కంటే స్వల్పంగా ఎక్కువ తెలుసు.” అని.(ఆంధ్ర జ్వోతి – జులై 1, 2014). ప్రధమ్ అనే స్వచ్చంధ సంస్థ – దేశ వ్యాప్తంగా సర్వే చేసి, “ 5 వ తరగతి విద్యార్థులు 1, 2 తరగతుల పాఠాలు చదవ లేరు” అని రాసింది.,- ( Annual education states report, 2010, ’11, ’12, ’13, ’14 లకు) – నేను ప్రశ్నించిన డజన్లు కొద్దీ  పిల్లలు ”3” లో నుంచి 6 తీసేయలేం,  “3” ను 6 పెట్టి భాగించటానికి వీలులేదు”  అని  7-10 తరగతుల పిల్లలు, సమాధానాలు చెప్పారు. ఈ విషయంలో గవర్నమెంటు తెలుగు మీడియం కాని, ఇంగ్లీసు మీడియం కార్పోరేటు స్కూళ్లు కానీ పరిస్థితి ఒకటే. గవర్నమెంటు తెలుగు మీడియం స్కూళ్లులో – ఆడపిల్లలకు మరుగు దొడ్లు లేవు. మాష్టర్లు లేరు. – ఉన్న వాళ్లు స్కూళ్లకు రారు.- వచ్చిన వాళ్లు పాఠాలు చెప్పరు. – చెప్పేవాళ్లకు చదువెంతొచ్చో అనుమానమే ! ఆ స్కూళ్లకు ఇంక ఏ దిక్కు లేని పేద పిల్లలే వెడతారు. అందులో ఆడ పిల్లలు ఎక్కువ. నాలుగిండ్లలో పాచిపని చేసుకునైనా తమ పిల్లల్ని (అందులో మగ మహా రాజుల్ని) ఇంగ్లీసు మీడియంలో నేర్పించాలని ఆరాట పడతారు తల్లులు. కూలీ నాలీ చేసుకునే తండ్రులు సగం సంపాదన తాగుడుకే పోస్తారు.

తలకు మించిన జీతాలు కడతారు.

వారి తలకు మించిన జీతాలు కడతారు.- ‘మమ్మీ’, ‘డాడీ’ అని నేర్పించటానికి. ప్రోగ్రెస్ కార్డుల్లో 98 శాతానికి తగ్గకుండా రిపోర్టులు చూచుకొని తమ పిల్లలకు నిజంగానే చదువొస్తొందని సరదా పడతారు మహా తల్లులు. ఆ మార్కులు క్లాసు పాఠాలు బట్టీ పెట్టి ముక్కున పెట్టుకున్న నాలుగు ముక్కల ఫలితమని తెలియదు పాపం !  ఇక ఇంకా పెద్ద కార్పోరేటు స్కూళ్లలో మరీ ఎక్కువ జీతాలు. – సంవత్సరానికి 50 వేల నుంచి 5 లక్షల వరకు కూడ – నాజీల  Concentration camp ల్లాంటి Techno schools  అనే ఫ్యాక్టరీలలో (ఆత్మహత్యలు చేసుకోవటానికి వీలు లేని హాస్టళ్లుంటాయి – ఫర్వాలేదు లెండి !) ఎమ్సెట్ రేంకు హోల్డర్లను తయారు చేస్తారు పోటా, పోటీగా. అందులో నూటికి 3 శాతం మందికి మాత్రమే  సాప్ఠ్ వేర్  కంపెనీల్లో ఉద్యోగార్హత వస్టుంది. మిగతావారి సంగతేంటో ఆ భగవంతుడికే తెలియాలి. ఆ సెలక్టు అయిన వారు – యువతీ, యువకులు కళ్ళు చెదిరేంత డబ్బు సంపాదిస్తారు. కాని జీవితంలో పొందవలసిన సుఖ, సంతోషాలు, స్నేహం, సేహార్థాలు, మంచి చెడుల విచక్షణ – లాంటి విషయాలలో మాత్రం దివాళా! ముప్పయ్యదేళ్ళకే ముసలితనం, విడాకులు. అశాంతి.!

ఒకప్పుడు అధిక జనాభా శాపం అనుకునే వాళ్ళం

   ఇంజనీరిగు, మెడిసిన్ల వగైరా కోర్సులకు వెళ్ళలేని తెలుగు మీడియం విద్యార్తులు డిగ్రీలు చదివి యూనివర్శిటీల్లో చేరతారు. అక్కడ మీడియం అధికారికంగా ఇంగ్లీష్ కాని పరీక్షలు తెలుగులో రాయచ్చు.(మన పాలకులు సామాజిక న్యాయం బాగా పాటిస్తారు) ఆధునిక విజ్ఞానమంతా ఇంగ్లీసులో ఉంటుంది. నలభై ఏళ్ళనాడు తెలుగు ఎకాడమీ ప్రచురించిన పుస్తకాలు – సబ్జెక్టులకు ఇంటర్ స్థాయిలో ఒకటి, రెండుంటాయి తప్ప యూనివర్శిటీస్థాయిలో ఒక్కటీ లేదు. అయినా మన గొప్పతనం ఏమిటంటే ఎం.ఎ, ఎం.యస్సీ లు చదివిన విద్యార్థుల్లో అత్యధిక సంఖ్యాకులకు ఫస్టు క్లాసులూ, డిష్టింగ్షన్లూను. మిరకల్స్ లోనమ్మకం వున్న దేశం కదా మనది – అందువల్ల ఆ ఫస్టు క్లాసులో ఏ ఉద్యోగం రాదు- యూనివర్శిటీలో వున్న సమయం అంతా పోటీపరీక్షల తయారీ కోసం ఉపయోగిస్తారు. అపనికైతే కోచింగు సెంటర్లు చాలుగదా. యూనివర్శిటీ లెందుకు ?

  ఒకప్పుడు అధిక జనాభా శాపం అనుకునే వాళ్ళం – ఇప్పుడు అది మనకు వరం. ప్రపంచంలోని అధిక సంఖ్యాక దేశాల్లో 60 ఏళ్ళు దాటిన వృద్దుల శాతం 60 కి మించిపోయింది..- అమెరికా, యూరపు, జపాను.- ఇంకా చైనా కూడ. – మన దేశం లోనే 25-45 సంవత్సరాల వయోజనులు 53 శాతం మించి వున్నారు. ఈయువతను మానవ సంపదగానూ, మూలధన వసతుగానూ మలచగలిగితే ప్రపంచాన్నే మలచగలుగుతారు. తగిన ప్రణాళికలు తయారుచేసి, అమలుచేయగల చిత్తశుద్ధి కలిగిన నాయకత్వం కావాలి.

మరొక్క మాట.

    ఈనాటి చదువులు ఉదర పోషణకు పనికి రావచ్చు గాని, వివేకవంతమైన సుఖజీవనాన్ని ఇవ్యలేవు. అరోగ్యవంతమైన శరీరం, వివేకవంతమైన మనస్సు, ఉదాత్తమైన మానవతా విలువలూ పాఠ్యాంశాలలో వుండవు. ఉప్పు,- కప్పురానికి మద్య తేడానీ, అల్పుడకీ – సజ్జనుడికీ, మద్య అంతరాన్నీ, ధర్మ – అధర్మాల మద్య విచక్షణనూ, మనిషికీ-మనిషికీ గల భేధాన్ని – ఈ చదువులు చెప్పలేవు. తెలుగులో విజ్ఞానఘనులైనా శతకాలు (వేమన, సుమతి, భాస్కర వగైరా) నూ, సుభాషితాలు (భర్త్రహరి) మాత్రమే వివేకాన్ని, విచక్షణనూ అందిస్తాయి. ఆదర్శాలూ, అలవాట్లూ, విలువలూ, అభిరుచులూ అంకురించి చిగురించేది హైస్కూలు రోజుల్లోనే. పాఠ్యాంశాలతో బాటు వీటి బోధన కూడ అవసరమే కదా !

              అయితే ఈ ‘ సోది ‘ అంతా దేనికంటారేమో ; నాది ‘సోది’ కాదు-ఆవేదన …. ఆలోచనాపరులైన మీకు నానివేదన.

ఇంతకీ నేనెవరు?  అనేగా మీ ప్రశ్న ..

  నా పేరు బోడేపూడి ప్రసాదరావు. ఆంధ్ర యూనివర్శిటీలో ఆచార్యుడుగా జీవితం గడిపి 20 ఏళ్ళ క్రితం రిటైరయ్యాను. 20 ఏళ్ళ కుర్రాణ్ణి. – అంటే 60 ఏళ్ళు పూర్ణాయుస్సునుకుంటే ఆపైది కొత్త జన్మే కదా. – అందులో 20 ఏళ్ళు గడిచినవి.. మొదట పాఠాలు చెప్పటం నావృత్తి – ఈ extended tenure కు సామాజిక సేవ నాప్రవృత్తి.- విధి ప్రసాదించిన ఈబోనస్ జీవితానికి అర్థం, పరమార్థం వెతుక్కుంటూన్న అన్వేషిని. పిల్లల చదువు నా obsession ; మీ సలహా, సహకారాలు ఆర్థిస్తున్నాను.

శలవు.

సెల్: 9000815272.