కొలుపులు అంటే ఏమిటి?
గ్రామ దేవతలుకు జరిపే ప్రత్యేక ఉత్సవమును కొలుపులు అంటారు. ఈ కొలుపులును ఊర పండగ అని కూడా అంటారు. కొన్ని చోట్ల ఉత్సవం జరిగే దేవత పేరుతో జాతర అని కూడ అంటుంటారు. ఉదా:-అంకమ్మ జాతర, పోలేరమ్మ జాతర మొదలగునవి. అన్ని గ్రామ దేవతల పండుగలు ఏ పేరుతో జరిగినా సూత్రధారిగా పోతురాజు ప్రాధాన్యం వహిస్తాడు. ఈ ఉత్సవాలలో పోతురాజుది కీలక పాత్ర.
గ్రామాన్ని గ్రామ దేవతలు రక్షిస్తే, గ్రామ దేవతలను సోదరుడుగా పోతురాజు రక్షింస్తాడని సాంప్రదాయవాదులు అంటారు. కొంత మంది పరిశోధకులు ఒకప్పుడు గ్రామ దేవతల భర్తగాను, వారి సేవకుని గానూ వర్ణించబడ్డాడని అభిప్రాయం వెళ్ళబుచ్చారు.
పూర్వం కలరా, మసూచి, ఆటలమ్మ అను వ్యాధులు త్రీవ స్థాయిలో విజృంబించి జననష్టం భారీగా ఉండేది. అలాగే వర్షాలు పడకుండా త్రీవ అనావృష్ఠి ఏర్పడి, తినటానికి తిండిలేక ఇబ్బందులు పడేవారు.అలాంటి సమయంలో అమ్మ వారికి కోపం వచ్చింది, అందువలనే ఈ వ్యాధులు, ఇతర కష్టాలు మనకు దాపురించాయి అనే నమ్మకం ప్రజలలో బలంగా ఉండేది. ఈ రోగాలు, మహమ్మారిల నుంచి, కరువు కాటకాల నుంచి రక్షించమని కోరుతూ, ఇలాంటివి ఏమి లేకపోతే రాకుండా కాపాడమని గ్రామదేవతకు ఊర పండుగ అని చేస్తారు. ఈ ఉత్సవాలు జరపక పోతే అమ్మ వారికి కోపం వస్తుందని ప్రజల నమ్మకం. ఆ జాతరలో జంతువులను, మేకలు, పొట్టేళ్లు, కోళ్లను బలిఇచ్చే ఆచారం ఉంటుంది. పొంగళ్లు చేసి అమ్మ వారికి నైవేధ్యంగా సమర్సిస్తారు. ఈ జాతర కొన్ని చోట్ల మూడు రోజులు, కొన్ని చోట్ల ఐదు రోజులు నిర్వహిస్తారు. ఇలా గ్రామ దేవతలకు జరిగే ఊరపండగ, జాతరలను కొలుపులు అంటారు.
కొలుపులు ప్రారంభానికి ముందు గ్రామ పెద్ద కాపు ఇంటి వద్ద నుండి మేళతాళాలతో, పూజా సామాగ్రితో వచ్చి, దేవాలయంలో తొలుత పెద్ద కాపు పూజల అనంతరం కొలుపులు ప్రారంభించటం ఆనవాయితి.
గ్రామ దేవతలు అంటే ఎవరు?
పూర్వం మన పూర్వీకులు గ్రామ ప్రజలను చల్లాగా చూస్తూ, అంటు వ్యాధుల నుండి కాపాడుతూ, భూత ప్రేతాలనుండి రక్షింస్తూ, పాడి పంటలు సవ్యంగా ఉండేలా చేస్తూ, గ్రామ సరిహద్దులను కాపాడే దేవతలు అనే నమ్మకంతో పుట్ట, భావి కలిగియున్న వేపచెట్టు సమీపంలో గ్రామానికి నాలుగు వైపుల పొలిమేరలలో , అప్పటి గ్రామం మధ్యలో ఎటువంటి ఆలయాలు లేకుండా శిలా విగ్రహాలను ప్రతిష్ఠించారు. పంచభూతాలు గాలి, నీరు, సూర్యుడు, భూమి, ఆకాశం కారణంగానే ఈ ప్రపంచం ఏర్పడింది. అందుకనే పంచభూతాలుకు ప్రతీకలుగా ఐదు ప్రదేశాలనందు గ్రామ దేవతలను ఏర్పాటుచేసారు.
గ్రామ ప్రజలను సదా కాపాడు చున్నందున వీటికి గ్రామ దేవతలని పిలుస్తున్నారు. పెండ్లిండ్లకు ముందుగా గ్రామ దేవతను ఆరాధించటం హిందువుల ఆచారం. లోగడ మసూచి, ఆటలమ్మ వ్యాధులు సోకినప్పడు తగ్గితే అమ్మవారికి (పోలేరమ్మ) కు “చద్ది” పెట్టే అచారం మన గ్రామాలలో ఇప్పటికీ ఉంది. పాడి పంట బాగుండాలని గ్రామ దేవతలను పూజించే విధానం మనకు తరతరాలుగా వస్తున్న గ్రామీణ సంప్రదాయం. గ్రామ దేవతలు వివిధ స్త్రీ దేవతా రూపాలలో వివిధ పేర్లుతో కలిగియున్నశక్తి స్వరూపిణిగా మనందరం భావిస్తాం.
గ్రామ దేవతలను ప్రతిష్ఠించంటంలో పూర్వీకుల మరొక ముఖ్య ఉద్దేశ్యం. దేవి నవరాత్రులు అలాంటి పండగలకు వేరే ప్రాంతాలలో ఉన్న కంచి కామాక్షమ్మ, మదుర మీనాక్షమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ వద్దకు వెళ్లాలంటే కుదరకపోవచ్చు. అందరం అన్ని చోట్లకు వెళ్లలేరు. కుదిరినప్పడు డబ్బు ఉండక పోవచ్చు. డబ్బు ఉన్నప్పడు అందరికి కుదరక పోవచ్చు. ఇలాంటి సమయాలలో అమ్మ వారిని దర్సించే భాగ్యం మనకు కలగలేదే అని అసంతృప్తి పడకుండా, ఎక్కడో ఉన్న అమ్మ వారిని ఇక్కడే దర్సించు కున్నామనే భావన వారి మనసులో కలిగేందుకు ముందు చూపుతో పూర్వీకులు గ్రామ దేవతల వ్వవస్థను నెలకొల్పారు.
పంచ భూతాలుకు ప్రతీకలు గ్రామ దేవతలు.
ఆ గ్రామ దేవతలకు భూదేవత, అగ్నిదేవత, జలదేవత, వాయు దేవత, ఆకాశ దేవత అని పేర్లు పెట్టారు.
పుడమి దేవత: పుడమి అంటే భూమి. భూమి లేనిదే పంట లేదు. ఆయా ప్రాంతంలో పండే పంటలను పుడమి దేవతను భూమిలో పండే పంట పేర్లతో జొన్నలు పండే చోట జొన్నలమ్మ, నూకలు అంటే వరి ధాన్యం పండే చోట నూకాలమ్మ అని పిలుస్తున్నారు. అలాగే గోగు పంట పండే చోట గోగులమ్మ అని వివధ రకాలుగా పేర్లు పెట్టారు.
అగ్ని దేవత: అగ్ని వెలుగుకు ప్రతీతి. మనకు సూర్య చంద్రులు వెలుగు నిస్తారు. పగటి పూట వెలుగు నిచ్చే సూర్యుడుని సూరమ్మ తల్లిని, రాత్రి తేజస్సు నిచ్చే చంద్రుడుని పున్నమ్మ తల్లిని, ఇక అమ్మ వారికి సూర్యుడు కుడి కన్నుగా, చంద్రుడు ఎడమ కన్నుగా భావించి (ఇరుకళ్లు అంటే రెండు కళ్లు) ఇరుకలమ్మగా పిలుస్తున్నారు.
జల దేవత: జలం అంటే నీరు అని మనందరకు తెలుసు. ఈ తల్లిని గంగమ్మ, గంగానమ్మ అని పిలుస్తున్నారు.గంగకు మూలస్థానం పాతాళం. మనం ఎక్కడైనా గమనించండి. గంగమ్మ తల్లి ఆలయాలు ఎంత ఎత్తులో కట్టినప్పటికి దేవతను చూడాలంటే మెట్లు దిగి క్రిందికి వెళ్లి దర్శనం చేసుకోవాలి.
వాయు దేవత: వాయువు ఉగ్రరూపం ధరించినప్పడు గాలికి చెట్టూ చేమా అతాలాకుతలమైతాయి. ఈ గాలిని కర్వలి/కరువలి అని అంటారు. అలాంటి ఉపద్రవాల నుండి కాపాడటానికి కురువలమ్మ దేవతగా పిలుస్తున్నారు.
ఆకాశ దేవత:ఆకాశం ఎత్తుగా ఉన్నందున కొండని ఆకాశ దేవతకు ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, గాలివాన, మెరుపులు బారి నుండి రక్షించటానికి ఈ దేవతను ఏర్పాటు చేసుకున్నారు. అందుకని ఈ దేవతని కొండమ్మ తల్లిగా పిలుస్తున్నారు.
ఈ రకంగా వివిధ ప్రాంతాలలో గ్రామ దేవతలకు నూట ఒక్క పేర్లుతో ఆరాధిస్తున్నట్లుగా తెలుస్తుంది.
పోతురాజు ఈ వృత్తిలోకి ఎలా వచ్చాడు?
ఈ కొలుపులుకు బ్రాహ్మణ పూజారి ఉనికి ఉండదు. పూర్వాచారాలను బట్టి ఈ ఉత్సవాలకు అధికారిక పూజారి పొతురాజు. గ్రామాలలో చిన్నతనం నుండి మనం చూస్తుంటాం. గ్రామ దేవతలను కుమ్మరి, యాదవ, మరి కొన్ని చోట్ల దళిత వర్గాలకు చెందినవారు మాత్రమే పూజా కార్యక్రమం చేస్తుంటారు. అలా పూజించే కుటుంబాల వంశీకులను వంశపారంపర్యంగా వారిని పోతురాజులుగా పరిగణించారు. ఈ పోతురాజును గ్రామదేవతలకు సోదరుడుగా భావించి పోతురాజు విగ్రహాలను పూజించడం, గౌరవించడం ఆచారంగా ఉంది. నూతనంగా వివాహమైన ఆడపడుచులకు అట్ల తద్దె తీర్చే రోజు పోతురాజు పాత్ర ముఖ్యం.
పోతురాజు ఆహార్యం
వంశ పారంపర్య పోతురాజుగా వ్యవహరించే వ్యక్తికి పుట్టు వెంట్రుకలు తియ్యరు. పుట్టినప్పుడు ఉన్న వెంట్రుకలే జీవింతాంతం ఉంటాయి. క్షురకర్మకు తావులేదు. కొందరు జుట్టును ముడివేసుకుంటారు. కొందరి జుట్టు జడలు కడుతుంది. ఉత్సవాల సమయంలో కాళ్ళకు కడియాలు, చేతిలో కొరడా, నడుం చుట్టూ చిన్న గంటలు, మణికట్టుకు కడియం, కాళ్ళకు గజ్జెలు ఉంటాయి. చొక్కా ధరించడు. పసుపు, కుంకుమ ముఖానికి, మిగిలిన దేహ భాగాలకు రాసుకుంటారు. కళ్ళకు కాటుక, నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. వేపాకు రెమ్మలు వంటి నిండా ధరిస్తాడు. పోతురాజు ఆహార్యం చూడగానే చిన్న పిల్లలు భయపడతారు.
గ్రామంలో కొలుపులు, ఊరేగింపుల సందర్భంలో పోతురాజు వేషంలో ఉండే వ్యక్తి ముందుండి దేవత ఊరేగింపుకు దిశానిర్ధేశం చేస్తాడు. ప్రజలను మార్గానికి అడ్డు రాకుండా అదుపు చేస్తాడు. తాను బలిచ్చిన జంతువు పేగులను మెడలో వేసుకుంటాడు. మాంసం ముక్కలను నోట్లో పెట్టుకుంటాడు. పేడ తట్టను తలపై పెట్టుకుని మోస్తాడు.వీర తాడుతో తనను తాను కొట్టుకుంటూ ఉగ్ర రూపంతో చిందులు తొక్కుతుంటాడు.
పోతురాజు నిర్వహించే కీలక ఘట్టం
కొలుపులు ఉత్సవంలో ముఖ్య విధి పోతురాజు గావుపట్టడం. అంటే అమ్మవారికి జంతుబలి ఇవ్వడం. సాధారణంగా బలివ్వడమంటే కత్తితో జంతువు మెడను కోసి దేవతకు అర్పించడాన్ని బలి అంటారు. కొలుపులలో పోతురాజు ఇచ్చే బలి నోటితో జంతువు మెడను కొరికి చంపడం. దీనినే గావు పట్టడం అంటారు. అయితే ఇక్కడ దున్నపోతు తలను మాత్రం ఒక్క కత్తి వేటుతో మొండెం నుంచి వేరుచేసి బలిస్తారు. మేక, లేక గొర్రె అయితే పోతురాజుకు గావు పట్టడం కష్టమైన వ్యవహారమే. కోడినైతే ఒకే ఒక్క గాటుతో మెండెం నుంచి తలను వేరు చేస్తారు.దాదాపుగా వేడుకగా పూర్వాచార ప్రకారం నోటితో గావు పడతారు తప్ప పూర్తిగా బలి ఇచ్చుట లేదు.
ఇదే సమయంలో అక్కడ భీతావహ పరిస్థితి కనిపిస్తుంది. డోలు, తప్పెట్ల మోతలతో ఆ ప్రదేశం మారుమోగిపోతుంది. ఒకపక్క బలిస్తున్న మేక అరుపులు దయనీయంగా ఉంటాయి. పోతురాజులను ఉత్సాహపరచ డానికి అక్కడ చేరిన భక్తుల కోరింతలు చప్పట్లుతో మార్మ్రోగుతాయి. ఎటువంటి వారికైనా గావు ప్రక్రియ కొత్తవారికి ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తుంది.ఆ వాతావరణం పోతురాజును గావు పట్టే ఉన్మాద స్థితికి తీసుకు వెళ్లింది. కొలుపులలో జంతుబలిని పోతురాజు ద్వారానే ఇవ్యడం పూర్వం నుండి వస్తున్న ఆచారం.
సర్వమానవ సౌభ్రాతృత్వం.
గ్రామ దేవతలు అన్ని వర్గాల ప్రజల సంస్కృతి పరిరక్షకులు. మధ్యం తాగిన మత్తులో కష్టాలు అన్నీ మరచి చిందులు వేసే భక్తులకు కులాలు గుర్తురావు. అంటరానితనం అసలే ఉండదు. ఏది ఏమైనా ధనికా పేదా, చిన్నా పెద్దా, తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా జరుపుకుంటారు. సర్వమానవ సమానత్వం ఈ జాతరల్లో కనపడతుంది. అదే కొలుపులు, జాతర, ఊరపండగ గొప్పతనం.సమాజంలోని బడుగు కులాలవారు కూడా అగ్రకులాలతో పాటు సమానంగా సామాన్య, సాంస్కృతిక ఆచార వ్యవహారాల్లో ఉత్సాహంగా మమేకం కావటం ఈ గ్రామదేవతల జాతరలలోనే కనపడుతుంది. వేరే ఉత్సవాలలో కనపడదు.