వృక్షో రక్షితి రక్షత:
“మనం చెట్టును కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది”.
అసలు మనందరం ఎంత సేపటికి మన సంతానానికి తరతరాలుగా సరిపోనుకాక, ఇంకొకరికన్న మనం ఎక్కువ ఎలా సంపాదించి ఇద్దమా అనే ధ్యాస మనందరిలో ఉన్నమాట వాస్తవం. సరే కాసేపు తప్పులేదు అనుకుందాం. ఆ సంపాదింది ఇచ్చింది అనుభవించుటానికి ఆరోగ్యకరమైన వాతావరణం వారికి అందించాలనే ఆలోచన గురించి బహు కొద్ది మంది మాత్రం తప్ప ఎవ్వరూ ఆలోచించుట లేదు. ఇది ఎవరు కాదన్నా అవునన్నా వాస్తవం. మనం జీవించినదే జీవితం కాదు. మన తరువాత మన భావి తరాలవారు ఆరోగ్యంగా జీవిస్తేనే మన జన్మ సార్ధకమైనట్లు. అలాంటి మంచి ఆలోచనతో మన గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది వేణుగోపాల్ (ఎజిపి) ఆధ్వర్యంలో ది.06.08.2017 ఆదివారం నాడు “వనం-మనం” కార్యక్రమం మన గ్రామంలో నిర్వహించటం చాలా అభినందించ తగ్గ విషయం.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంద్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కుమార్ ఖైత్ పాల్గొన్నారు. ముందుగా మేళతాళాలుతో గ్రామ పెద్దలు , విద్యార్ధినీ, విద్యార్దులు వెంటరాగా “మానవ మనుగడకు వృక్షాలే కీలకం” అనే బ్యానర్లు, ప్లే కార్డులు చేతబూని అతిధులను సాదరంగా ఆహ్వానించారు. తదనంతరం పాఠశాల ఆవరణలో పసుపు, కుంకమ, పూలుతో అందంగా అలంకరించిన పాదులలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య జస్టిస్ సురేష్ కుమార్ ఖైత్ చే మొక్కలు నాటించారు. పొనుగుపాడు నుండి గుంటూరు-కర్నూలు వెళ్లే అప్రోచ్ రోడ్డుకు ఇరువైపుల, ఇంకా జిల్లా పరిషత్ ఆవరణలో, మెరికపూడి వెళ్లు మట్టి రోడ్డుకు రెండు వైపుల, నార్నెపాడు వెళ్లు డొంక రోడ్డులో ఇరువైపుల మొక్కలను నాటారు. గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం పండగ వాతావరణాన్ని తలపించింది.
ఈ కార్యక్రమం సందర్బంగా జిల్లా పరిషత్ ఆవరణలో జరిగిన సమావేశంలో జష్టిష్ సురేష్ కుమార్ ఖైత్ మాట్లాడుతూ మానవాళికి చెట్లే ప్రాణ దాతలని, సమస్త ప్రాణికోటికి వృక్షం ప్రధానమైందని చెప్పారు. చెట్టును మనం రక్షిస్తే మనకు అది ప్రాణవాయువు ఇచ్చి మనల్ని రక్షించిదని, వాతావరణ సమతుల్యాన్ని కాపాడుతుందని, మానవ జీవితానికి అవసరమైన కలప, అనేక సుగంధ ద్రవ్యాలు అందిస్తాయిని చెప్పారు. జష్టిష్ సురేష్ కుమార్ ఖైత్ ఆంగ్లంలోచేసిన ప్రసంగాన్ని, జిల్లా జడ్జి హరిహరనాధ శర్మ తెలుగులో అనువదించి చెప్పారు. న్యాయవాది వేణుగోపాల్ మాట్లాడుతూ నాటిన 2500 మొక్కలను గ్రామస్తుల సహకారంతో కాపాడతామని, ప్రస్తుతం నాటిన మొక్కలు భవిష్యత్తరానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పారు.గ్రామాన్ని నందనవనంగా తీర్చి దిద్దుతామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి హరి హరనాధ శర్మ , రెండవ అదనపు జడ్జి సురేష్, నరసరావుపేట జిల్లా జడ్జి జయకుమార్, జాయంటు కలెక్టరు-2 యం. వెంకటేశ్వరరావు, ఆర్.డి.ఒ. బండ్ల శ్రీనివాస్, జిల్లా ఇన్ చార్జి డి.ఇ.ఒ. పిల్లి రమేష్, నరసరావుపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంటు పంగులూరి ఆంజనేయులు, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి ఉమా మహేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వర్లు, డివిజనల్ సామాజిక అటవీ అధికారులు యల్.బీమయ్య, కె.మోహనరావు, తహసీలుదారు పార్ధసారధి, ఎం.పి.డి.ఒ. శ్యామలాదేవి ఇతర ఆధికారులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన స్థానికులు ముఖ్యులు సర్పంచ్ మాధవరావు, యం.పి.టి.సి. అమరయ్య, వంకాయలపాటి బలరామ కృష్ణయ్య, రాయంకుల శేషతల్పశాయి, గుంటుపల్లి జగన్నాధం, క్రోసూరి సుబ్బారావు, చంద్రమౌళి, తులసీధరరావు, రామాంజనేయులు, హెచ్.యం.పద్మావతి, తదితర గ్రామ పెద్దలు, విద్యార్ధిని విద్యార్దులు పాల్గొన్నారు. సమావేశ అనంతరం జష్టిష్ సురేష్ కుమార్ ఖైత్ ను గ్రామ పెద్దలు అధికారులు సన్మానించారు.