దేవాలయాలు నందు పాటించవలసిన నియమాలు.
Yarra Ramarao
May 3, 2017
దేవాలయాలు
ఆగమ శాస్త్రములో దేవాలయములో అర్చకులు, భక్తులు, అధికారులు ఏ విధముగా వ్యవహరించకూడదో వివరించబడింది.
- ఆలయములోనికి తలపాగా ధరించి వెళ్లరాదు.
- చేతిలో లేదా ఇతర విధంగా ఎటువంటి ఆయుధములు తీసుకుని వెళ్లరాదు.
- ఆలయము లోపల వాహనము మీదగానీ, పాదరక్షలతో గాని తిరుగరాదు.
- దేవాలయ ప్రాంగణం లోనికి మత్తు పదార్ధంలు,మాదకద్రవ్యాలు సేవించిగాని,తీసుకుని గాని వెళ్లరాదు.
- ఆలయ ప్రాంగణములో మల, మూత్ర విసర్జన చేయరాదు.
- ఆలయమందు కాళ్ళు చాపుకొని కూర్చుండుట, నిద్రపోవుట చేయరాదు.
- ఏ ప్రాణికైనా దుఃఖం కలిగించే ఎటువంటి హింసనూ చేయరాదు.
- ఆలయములో ఎన్నడూ ఎవరితో వివాదములు పెట్టుకోరాదు.
- దేవాలయంలో అహంకారముతో, గర్వముతో, అధికార దర్పముతో ఉండరాదు.
- ఆలయములో దేవుని ఎదుట పర స్తుతిని, పర నిందను కూడా చేయరాదు.
- ఆలయములో దేవుని ఎదుట పృష్ఠభాగం చూపిస్తూ కూర్చుండరాదు.
- ఆలయంలోఅధికార గర్వంతో అకాలంలో ఆలయంలో ప్రవేశించి అకాల సేవలను చేయరాదు/చేయించుకొనరాదు.
- ఆలయాలలో భగవంతునికి ఒక చేతితో ప్రణామము చేయరాదు.
- ఆలయాలలో ఇతరులకు నమస్కరించడం చేయరాదు. భగవంతుని ఎదుట అందరూ సమానులే అని భావించవలెను.
- పూజాది కార్యక్రమాలనందు భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు.
- పురాణ కథలు,ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగుతున్నపుడు ఎటువంటి విఘ్నాలు కలుగ చేయరాదు.
- ఆలయ ఆవరణలో పెద్దగా అరవటం, నవ్వటం,స్వంతవిషయాలు మాట్లాడటం చేయరాదు.
- ఆలయంలో నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళు కొరుకుట, పెద్దగా నవ్వుట చేయరాదు.
- దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.
- ఆలయంలోనికి నుదుట కుంకం లేదా తిలకం ధరించకుండా వెళ్లరాదు.
- ఆలయంలోనికి తాంబూల చర్వణం చేస్తూ లేదా ఆహారాదులు తినుచూ ప్రవేశించరాదు.
- కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోయినా దోషం ఏమి లేదు.
- ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే ఒంటరిగా బయటకు పిలిచి సున్నితంగా మందలించాలి.
- దేవాలయంలో దేవుని ముందు ఆధిక్యతను ప్రదర్శిస్తే దైవనిందతో సమానం.
శ్రీమతే రామానుజాయ నమ:
- ఆలయంనకు వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. మనకు తోచిన పండ్లు లేదా పూలు ఏదో ఒకటి తీసుకు వెళ్లి సమర్పించటం మంచి సంప్రదాయం.
- ఆలయంలోనికి ప్రవేశించే ముందు తప్పని సరిగా తొలుత రెండు కాళ్లు వెనుక,ముందూ తడిచేలా కడుక్కుని,మూడుసార్లు నోటిని పుక్కింలించి నీటిని బయటికి వదలాలి. తొందరగా తిరిగి వెళ్లాలనే మనసుతో కాకుండా ప్రశాంతంగా, నెమ్మదిగా భగవంతుడ్ని దర్శించాలి.
- ఆలయమునకు ప్రదిక్షిణ చేసి తరువాత లోనికి ప్రవేశించాలి.ఆలయ ప్రదిక్షిణ వింటి నుంచి వెలువడ్డ బాణంలా వెనుకెవరో తరుముతున్నట్లు ప్రదిక్షిణం చేయరాదు.నిండు గర్భిణి నడిచినట్లు అడుగులో అడుగు వేస్తూ అడగడుగునా దేవుని స్మరిస్తూ ప్రదిక్షిణలు చేయాలి.
- చాలా మంది ప్రదిక్షిణలు చేస్తున్నప్పడు దేవాలయం వెనుక భాగాన్ని అద్ది నమస్కరిస్తుంటారు.అలా చేయరాదు.ఆభాగంలో రాక్షసులుంటారు.అలాగే ఆలయానికి గజం దూరం నుంచి ప్రదిక్షిణ చేయాలి.
- విష్ణు ఆలయంలో నాలుగు ప్రదిక్షిణలు చేయాలి.ఆలయంలో ఆత్మప్రదిక్షిణ అనునపుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు, ప్రదిక్షిణం ఆలయం చుట్టూ మాత్రమే చేయాలి.
- పూజారి కుడివైపునఉండి పూజాదికాలు నిర్వహిస్తుంటాడు. మనం ఎడమ వైపు నిలచి నమస్కరిస్తే భగవంతుని దర్శనం కనులకింపుగా కనపడుతుంది.
జై శ్రీమన్నారాయణ
- అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి) దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి, తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి, తరువాత ఆపాదమస్తకము దర్శించాలి.
- ఆలయంలో దేవతా విగ్రహాలకు ఎలా నమస్కరించాలి?తోసుకుంటూ లేదా ముందువారిని అధిగమిస్తూ దర్శనం చేయరాదు.భగవంతుడ్ని కనులారా వీక్షించి ఆపై కనులు మూసుకొని ధ్యానం చేయాలి. చేతుల్ని మన హృదయానికి మధ్యలో కాకుండా కొద్దిగా పక్కకు పెట్టి నమస్కరించాలి.
- అలా చేస్తే భగవంతునికి సూటిగా నమస్కరించినట్లు.లేకపోతే మనకు మనం నమస్కరించకున్నట్లుగా పరిగణించాలి.
- భగవంతుని ముందు ఆశల పళ్లెం చేతపట్టుకొని యాచకుడుగా నిలబడకూడదు.భక్తుడిగా నిలబడాలి.ఎవరికి ఏమి దక్కలో వారికి అదే దక్కుతుంది.దైవం కనబడునదికాదు.ఫలితం మాత్రమే కనపడుతుంది.
- గుడి పూజారికి కానుకులిచ్చి తీరాలన్న నియమం ఏమి లేదు.కాని నీదైవ సేవకునికి నీకు తోచినంత మనస్పూర్తిగా ధర్మం చేయుటలో తప్పేమి లేదు.
- హారతి వల్ల ప్రయోజనం ఏమిటి? కర్పూరహారతి ఎలా కరిగిపోతుందో,అలాగనే మనం తెలిసీ తెలియక చేసిన తప్పులు సమసిపోవాలని బగవంతుడ్ని వేడుకుంటూ హరతిని కళ్లకు హద్దుకోవటమే అసలు సిసలుయైన ఆధ్యాత్మిక అంతరార్ధం.
- తీర్దం ఎలా తీసుకోవాలి?దేవాలయంలో నిల్చుని తీర్ధం పుచ్చుకోవాలి. తీర్ధం తాసుకోవటానికి చేతిని గోకర్ణ భంగిమలో ఉంచి తీసుకోవాలి.తీర్ధం తీసుకోవటంవల్ల చేయి ఎంగిలవుతుంది.ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు..తీర్ధం తీసుకున్న చేతిని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.
- వైష్ణవ సంప్రదాయంలో గంగాజలంతో అభిషేకం చేసిన తీర్ధాన్ని మాత్రమే తల వెనుక రాసుకోవాలని ఉంది.తీర్దం సేవించేటప్పడు నేలపై పడకుండా జాగ్రత్త పడాలి.
- గుడిలో దర్శనం అయ్యాక కూర్చొనేదెందుకు.?భగవంతుని దర్శనము,షడగోప్యము అయ్యాక ఒకింత సేపు కూర్చోని వెళ్లాలి. అలా కూర్చోమనేది ప్రశాంతతకోసం, పుణ్యంకోసం. కూర్చోకుండా వెళితే స్వామిని దర్శించిన ఫలం దక్కదు.
- అలా కూర్చున్నప్పడు నంచి,చెడులు బేరీజు వేసుకుంటాం.ప్రశాంత మనసుతో ఆలోచిస్తాం. ఏది తప్పు,ఏది ఒప్పు అని ఆలోచనలో పడతాం.రోజువారి జీవన విధానాన్ని సరిచేసుకొని మంచి నార్గంలో నడుస్తాం.