శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం చరిత్ర (పొనుగుపాడు)

దేవాలయ చరిత్ర (మొదటి భాగం)

దేవస్థానం ఎవరు, ఎప్పుడు నిర్మించారు ?

ఈ సంగతులు మనం తెలుసుకొనుటకు ముందు గ్రామకైఫియ్యత్తుల గురించి తెలుసుకోవాలి. 

అసలు కైఫియత్తులు అంటే ఏమిటి?

బ్రిటీషు వారి ఈస్టిండియా కంపెనీ మన దేశంలో వ్యాపార ఉద్దేశ్యంతో  16 శతాబ్దము లో ప్రవేశించిన సంగతి మనందరుకు తెలుసు.ఆ తర్వాత కొంతకాలానికి అంటే సుమారు 18వ శతాబ్ధం ద్వితీయార్ధం తర్వాత అనేక ప్రాంతాలలో పరిపాలన అధికారం సాగించింది.

పూర్వం పరిపాలన ఉంటే ప్రజలపై అనేక రకాల పన్నుల విధించి వసూలు చేయటమే.కొద్ది కాలానికి బ్రిటీషు వారు (1767) సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసి, అందులో భాగంగా భారత దేశ సహజ వనరులపై దృష్ఠిపెట్టి పరిశోధనకు నాంది పలికారు.

ఆ కనుగొనుటలో భాగంగా గ్రామ అధ్యయనాలు జరపడంలో 1784 నుంచి 1816 మధ్య కోలిన్ మెకంజీ (1754-1821) చేసిన సర్వే మరియు ఆయన కృషి వలన ఇవాళ మన తెలుగు ప్రాంతంలలో అత్యధిక భాగం కనీసం పది జిల్లాల గ్రామాల చరిత్ర మనకు తెలుస్తుంది.

కోలిన్ మెకంజీ 30 సంవత్సరంల వయసులో (1783) ఉద్యోగం కోసం  భారతదేశానికి వచ్చాడు.ఉద్యోగిగా ఇంజనీరింగ్ విభాగంలో  చేరి సైన్యం వెంట పయనిస్తూ 1784-90 మధ్య నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలలో రహదారుల, మార్గాల పటాలు తయారు చేశాడు. బ్రిటీష్ పాలకులు కోలిన్ మెకంజీ లోని నిబద్ధతను గుర్తించి  1790లో ఆయనకు గుంటూరు సర్కారును సర్వే చేసే బాధ్యతను అప్పగించారు.

కాలిన్ మెకంజీ చేసిన కృషి

1790 నుంచి 1793 వరకు కోలిన్ మెకంజీ గుంటూరు సర్కారును మాత్రమే కాక, పొరుగున ఉన్న కడప, కర్నూలు ప్రాంతాలను, నల్లమల, ఎర్రమల కొండలను కూడ సర్వే చేశాడు.ఆ తర్వాత 1794లో పెన్నా, కృష్ణా నదుల మధ్య ఉన్న నిజాం సరిహద్దు ప్రాంతాలన్నిటిని కూడ సర్వే చేశాడు.ఆయన చేసిన కృషివల్ల మెకంజీ ఆ తర్వాత ఈస్టిండియా కంపెనీ అధికారంలో ఉన్నత స్థానానికి ఎదిగాడు.

ఆయా గ్రామాల గురించి పాలకులకు అవసరమైన సమాచారాన్ని రాబట్టడానికి మెకంజీ 1810 నాటికి 2070 స్థానిక చరిత్రలు వ్రాయించాడు. ఆనాటి ప్రాంతీయ సర్వేయర్ జనరల్ స్థానం నుండి 1816లో భారత దేశపు మొదటి సర్వేయర్ జనరల్ పదవి చేపట్టాడు.అప్పటికి కొన్ని గ్రామాలలోని భూములు, పంటలు మరియు పన్నుల గురించి సమాచారాన్ని భద్రపరచిన కవిలె, లేదా దండ కవిలె అనే కరణీకపు చిట్టాలే ఈ గ్రామ కైఫియ్యత్తులు.

ఇవి చాలా వరకు గ్రామాల చరిత్రకు ఆధారంగా నిలిచాయి.వాటన్నిటినీ గ్రామ కైఫియ్యత్తులు అని అంటుంటారు. మెకంజీ కూడా ఆనాటి సమాజంలో మంచి చదువుకున్న,గ్రామం గురించి అహగాహన ఉన్న కరణాలతో వారి గ్రామాల గురించి ఈ స్థానిక చరిత్రలు రాయించాడు.

ఇవన్నీ కనీసం రెండు వందల సంవత్సరాల క్రింద వాడకంలో ఉన్న భాషలో, పద ప్రయోగాలతో, అదికూడ పండితులు వ్రాసినట్లుగా ఉన్నవి.వాటిని చదవడానికి కష్టపడవలసి వచ్చినా కొంత విలువైన సమాచారం మనకు తెలుస్తుంది.ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్ వారు వీటిని 1988లో ప్రచురించారు.

కైఫియ్యత్తుల లోని పదాలకు అర్థాలు: 

 1. మజుకూరి = A fore said, above mentioned, పైన వివరింపబడిన.
 2. మిరాసిదారుడు = hereditary right, వంశ పరంపరంగా వచ్చే బాధ్యత.
 3. ఫసలి = the revenue year which begins on the 14th of July. రెవిన్యూ లెక్కల సంవత్సరం.
 4. కైపియ్యత్తులు = సంగతులు, విషయాలు, కవిలకట్ట.
 5. అరకుచ్చల = 22 యకరంలకు సమానం.
 6. సంప్రతివారు = కరణం హోదా కలవారు.
 7. మృత్యజాంన్నగరు/ముర్తిజానగరు సర్కారు =The Persian name of Guntur, Like Andhra Sarkar (ప్రభుత్వం).
 8. మవుంజె = ఒక వూరిలో చిన్నపల్లె.
 9. సమంతు/సంత్తు = తాలూకాలో ఒక భాగం,
 10. హైవేలి = నగరు,
 11. ముఠే = కొన్ని గ్రామాలు
 12. హైవేలి గ్రామాలు: గతంలో nabobs (నవాబులు) చేతిలో లేదా తన immediate (వెంటనే) నిర్వహణలో ఉంచిన గ్రామాలు.
(1) Guntur dist. Kaifiyats 3rd part page no. 204.Pdf-1 (Ponugupadu) watch and read click here
(1A) 3rd part page no. 205 Pdf-1A (Ponugupadu) watch and read click here
(2) Guntur dist. Kaifiyats 4th part page no. 192 Pdf-11 (Ponugupadu) watch and read click here
(2A) 4th part page no. 193 Pdf-11A (Ponugupadu) watch and read click here

శ్రీఆంజనేయస్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పాపరాజు

జీర్ణోద్ధరణకు ముందు ఉన్న దేవాలయం
జీర్ణోద్ధరణకు ముందు ఉన్న దేవాలయం

పైకైఫియ్యత్తుల ప్రకారం మజుకూరి మిరాసిదారుడైన పాపరాజు ‘సిద్దార్ది’ నామ సంవత్సరంలో గ్రామానికి తూర్పు పార్శ్యం (ప్రక్క) ఆంజనేయస్వామి వార్కి ఆలయం కట్టించి, శ్రీస్వామివారిని ప్రతిష్ఠించి,పూజించటానికి కౌండిన్యస గోత్రికులైన శ్రీపెరంబదూరు కేశవాచార్యులనే పాంచరాత్రుని (ఆగమ శాస్రం తెలిసిన వ్యక్తి) నియమించినట్లు సృష్టంగా తెలుస్తుంది.

అంతేగాదు నిత్యనైవేధ్యం, దీపారాధన జరుగగలందులకు  రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడుకు చెప్పి, అరకుచ్చల ఇనాం భూమి ఇప్పించినట్లు కూడా పై కైఫియ్యత్తుల ద్వారా తెలుస్తుంది. ఇనాం భూమి య.22.00లు (డి.నెం.464.) ఇప్పటికి శ్రీఅంజనేయ స్వామి వారి దేవస్థానం అధీనంలోఉంది.

ఇక్కడ మనకు రెండు సందేహలు రావచ్చు. 1.సిద్దార్ది నామ సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరంల ప్రకారం ఏ సంవత్సరంలో ఆలయం నిర్మాణం జరిగింది?. 2. ఆ కాలంలో అసలు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పరిపాలన సాగించాడా? అనే ప్రశ్నలు మనకు ఉదయిస్తాయి.

ఆరెండు సందేహాలు నివృత్తి కావటానికి విశ్లేషించగా డా.ముప్పాళ్ల హనుమంతురావు యం.ఎ. , బి.యల్. , పి.హెచ్.డి., వారు రచించిన “కమ్మ వారి చరిత్ర” గ్రంధంలోని పేజి నెం.183 లోని రెండువ పేరాలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఈ ప్రాంతాన్ని 1783 నుండి 1816 వరకు పాలించినట్లుగా ఉటంకించి యున్నారు.

ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత 

ఈ కాలంతో పోల్చి పరిశీలించగా  తెలుగు సంవత్సరాలు ఒకసారి వచ్చిన సంవత్సరం తిరిగి 60 సం.ములకు వస్తుంది అని మనందరకు తెలుసు. పైన చెప్పిన ప్రకారం రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పరిపాలించిన కాలం 1783-1816 తో పోల్చుకొని పరిశీలించగా 1799.1800 (ఏప్రియల్ 1799 నుండి మార్చి 1800) సిద్దార్ధి నామ సంవత్సరం వచ్చినట్లు తెలుస్తుంది.

సిధ్ధార్థి నామ సంవత్సరం ది.06.04.1799 నుండి 25.03.1800 వరకు వున్నట్లుగా ఆ సంవత్సరం పంచాంగం ద్వారా తెలుస్తుంది.కావున దీనిని బట్టి 06.04.1799 నుండి 25.03.1800 మద్యకాలంలో దేవాలయం నిర్మించి ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు మనకు తెలుస్తుంది.

ఎటువంటి ఆధారం లేక పోయినప్పటికి కొద్దిగా నిశితంగా పరిశీలిస్తే 1799వ సంవత్సరం ఏప్రియల్ 19 న హనుమాన్ జయంతి వచ్చింది. ఆ రోజున విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసినా చేసి ఉండవచ్చు.ఎటువంటి సందేహానికి తావులేదు. ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందనే దానిపై మనకు ఒక స్పష్టత వచ్చింది.

సందేహాలు నివృత్తి

మనకు ఇక్కడ అసలు ఈ పాపరాజు ఎవరు? వీరు ఏ వంశీయులకు చెందినవారు? వీరి పూర్వీకులు ఎవరు.? వీరి వంశీయులు పొనుగుపాడు గ్రామంలో నివసించారా.? ప్రస్తుతం ఈ వంశీయులు వారసులు గ్రామంలో ఉన్నారా.? అనే ప్రశ్నలు ఉత్పన్నమైనవి.ఆ వివరంలు తెలుసుకుందాం.

బ్రాహ్మణ కులానికి చెందిన పొనుగుపాటి వంశీయుల తొమ్మిది తరాల క్రిందటి మూల పురుషుడు వెంకంరాజు.ఇతను  సుమారు 18 వ శతాబ్థం ద్వితీయార్థం అనగా 1750 – 1800 మధ్య ప్రాంతమునకు చెందిన వాడు.ఆయనకు నలుగురు కుమార్లు.వారిలో ప్రధమ కుమార్డు పాపరాజు. రెండవ కుమార్డు దేవల్ రాజు.మూడవ కుమార్డు అయ్యపరాజు.నాలుగవ కుమార్డు వీర్రాజు.

మనకు ఇక్కడ మూల పురుషుడు వెంకంరాజు బ్రాహ్మణ కులానికి చెందిన పొనుగుపాటి వంశీయులేనని ఆధారం ఏమిటి? పాపరాజు ఆయన కుమార్డు అనే దానికి నిదర్శనం ఏమిటి? అనే సందేహాలు రావచ్చు. ఆ సందేహాలు నివృత్తి కావాలంటే ఇంకా మనం కొంత చరిత్ర తెలుసుకోవాలి.

పొనుగుపాటి వంశీకులు  పొనుగుపాడు గ్రామంలో మొన్న మొన్నటి వరకు నివసించినట్లు ఇప్పడు ఉన్న పెద్దవారి అందరికి తెలుసు.ఎక్కువ మంది  నా చిన్నతనంలో (1960 ఆ ప్రాంతంలో) మా బజారు (పడమర బజారు) లోనే వుంటూ వ్యవసాయభూమి కలిగి ఉండేవారు.

1950 వరకు గ్రామ కరణంగా పని చేసిన లక్ష్మీకాంతారావు భార్య అనంతరామమ్మ గత నాలుగు సంవత్సరంల క్రిందట వరకు గ్రామంలోనే ఉండేది.ప్రస్తుతం ఆమె హైదారాబాదులోని మీర్ పేటలో ఉంటుంది. చరిత్ర తెలుసుకొనుటలో భాగంగా అనంతరామమ్మ వద్దకు వెళ్లటం జరిగింది.

మూలం ఈ వంశవృక్షం

అమెతో కాసేపు మంచి చెడూ ముచ్చటించి, మీ పూర్వీకుల వంశవృక్షం ఏమైనా ఉంటే ఇవ్వండి అని అడగటం జరిగింది.అలాంటిది ఏమిలేదయ్యా  కావాలంటే నాకు తెలిసినంత వరకు చెపుతాను అంది.

మా సంబాషణ ఆమె కుమార్తె విజయమ్మ విని, సిరిపురపు వెంకటరమణయ్య (స్వాతంత్ర సమర యోదుడు, 1922లో అల్లూరి సీతారామరాజు కు ధైర్యంగా ఆతిధ్యమిచ్చిన వ్యక్తి, విజయవాడ లోని సత్వనారాయణపురం వ్యవస్థాపకుడు)  తాతయ్య శతజయంతి ఉత్సవం (ది.24.09.1987 న విజయవాడ లోని సత్యనారాయణపురం శ్రీ అన్నపూర్ణ దేవాలయంలో జరిగింది.) పుస్తకంలో నేను చూసినట్లు గుర్తు అని  మాతో అంది.

దాని మీదట నేను అమ్మా ఆ పుస్తకం శ్రమ అనుకోకుండా కొద్దిగా వెతికి ఇవ్వండమ్మా అని అడిగాను.శ్రమ  తీసుకుని ఆ పుస్తకం వెతికి తీసుకు వచ్చింది.ఆ పుస్తకం పరిశీలించగా మనం పైన చెప్పకున్న పాపరాజు తండ్రి  వెంకంరాజు నుండి మొన్నమొన్నటి వరకు పొనుగుపాడు గ్రామంలో నివశించిన పొనుగుపాటి వంశీకులకు చెందిన అందరి పేర్లతో కలిగిన వంశవృక్షం ఉంది.

ఉద్యోగరీత్యాగానీ, ఇతర కారణాల  వల్లనైతేనేమి ప్రస్తుతం గ్రామంలో ఎవ్వరూ నివాసం లేరు. 

పొనుగుపాటి వంశీయుల మూలపురుషుడు  వెంకంరాజు వంశవృక్షం.

పై పొనుగుపాటి వారి పూర్వీకుల వంశవృక్షం లోని పేర్లకు, పైకైఫియ్యత్తులలో వివరించిన సమాచారంలోని పేర్లకు సరిపోల్చగా సరి పోయింది.దీనినిబట్టి వెంకంరాజు ప్రథమ కుమార్డు పాపరాజు శ్రీఆంజనేయస్వామి దేవాలయం నిర్మించినట్లు సృష్ఠంగాతెలుస్తుంది.

అంతేగాదు శ్రీకొడాలి లక్ష్మినారాయణ బి.ఎ., 1963లో వ్రాసిన వెంకటాద్రినాయుడు జీవితచరిత్ర గ్రంధంలోని పేజి నెం. 196 లో కూడా ఈ విషయం ఉదహరించారు.

కానీ ఈ విషయం వెలుగులోకి రానందున  ఆంధ్రప్రదేశ్ హిందూమత దేవాదాయ, దర్మాదాయ చట్టం 30/1987 సెక్షన్ 43 ప్రకారం ఈ దేవస్థానంనకు సంబంధించిన ఆస్తులు, ఇతర వివరాల నమోదు రిజిష్టరు (సంఖ్య:C. No. A 3/11647/2006. dt. 04.12.2006) రెండవ పేజి నందు “ఈ దేవాలయం సుమారు మూడు వందల సంవత్సరంల క్రితం గ్రామస్తులచే నిర్మించబడినదని (అంటే రిజిష్టరు తయారు తేది.16.10.2006 నాటికి) గ్రామస్తులను మరియు అర్చక స్వామిని విచారించగా తెలియుచున్నది” అని రికార్డు చేయబడింది.

ఈఆలయంనకు శ్రీవాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఇనాం భూమి దానం చేసినట్లుగా పై కైఫియ్యత్తులు ద్వారా మనకు తెలుస్తుంది. కానీ ఆవిషయం ఇటు దేవస్థానం రికార్డు నందు గాని,అటు రెవిన్యూ లెక్కలులో గాని నమోదు కాకపోవటం విచారించతగ్గ విషయం.

వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పరిపాలన కాలంలో ఆయన చాలా దేవాలయలు నిర్మించి, వాటికి ఇనాంగా భూములు ఇచ్చినందున ఆయనే ఈ ఆలయం నిర్మించి భూమి ఇచ్చి ఉండవచ్చు అనే అపోహ గ్రామస్తుల మనసులో ఉంది. 

పూర్వపు వంశపారంపర్య దర్మకర్తలు.

దేవస్థానం వంశపారంపర్య ఆలయ ట్రష్టు బోర్డు చైర్మెన్ గా పొనుగుపాటి వెంకటరమణయ్య (వీరి కాలు ఆరోగ్యరీత్యా తొలగించారు) పనిచేసేకాలంలో మనకు స్వాతంత్ర్యం రాకముందే బ్రిటీసు పరిపాలన కాలంలో మొదటిసారిగా  వంశ పారంపర్య ఆలయ ట్రష్టు బోర్డును హిందూ మత హక్కుల చట్టం క్రింద అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్టంలో హిందూ రెలిజియస్ ఎండోమెంట్ బోర్డు వారివద్ద రిజిష్టరు చేసి, సంఖ్య నెం.4776 రు తేది.27.10.1943లో అప్రూవల్ పొందారు.

పొనుగుపాటి బ్రాహ్మణ వంశానికి చెందిన వారసులు పూర్వం నుండి అప్పయ్య, సీతారామయ్య, కాంతయ్య, వేంకటరమణయ్య, నాగభూషణం వంశపారంపర్య ఆలయ ట్రష్టు బోర్డు చైర్మెన్లుగా పనిచేసారు.

ఫైవారి తరువాత లక్ష్మీకాంతారావు, వారి తరువాత కోటేశ్వరరావు పంతులుగారు వంశ పారంపర్య ఆలయ ట్రష్టీలుగా పనిచేసారు. కోటేశ్వరరావు పంతులుగారు ట్రష్టీగా పనిచేసిన కాలంలో ముఖ మండపం కట్టించారు.కోటేశ్వరరావు పంతులుగారు తరువాత  లక్ష్మీకాంతారావు కుమార్డు వెంకట రమణయ్య 1981 వరకు వంశ పారంపర్య ధర్మకర్తలుగా పనిచేసారు.

వంశపారంపర్య ధర్మకర్తలుగా పనిచేసిన వారిలో వెంకటరమణయ్య చివరి వ్యక్తి. ఇప్పుడు ఉన్న గ్రామస్థులలో పెద్ద వారందరికి ఈ విషయాలు తెలుసు. ప్రభుత్వ దేవాదాయ శాఖ రికార్డు ద్వారా కూడా తెలుస్తుంది.

లక్షీకాంతారావు
వెంకటరమణయ్య (చివరి ట్రష్ఠీ)

పొనుగుపాడు ప్రజలందరికి తెలిసిన వ్యక్తి తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పోరేషన్ ఇండియా లిమిటడ్ ( రిషికేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రం) చైర్మెన్ మరియు మేనేజింగ్ డైరక్టరుగా పనిచేసిన రాయంకుల శేషతల్ప శాయి ఈ విషయంపై స్పందించి Whatsaap ద్వారా దేవాలయ కమిటి వార్కి సూచన చేసారు. వారి పంపిన మెసేజ్ దిగువ యధాతధంగా పొందుపర్చటమైనది.

(I suggest that a granite tablet indicating the history of Anjaneya Swamy Temple i.e the construction by Ponugupati paparaju garu and Land grant by Vasireddy Venkatadri Nayudu garu would be installed.Pl take up with Temple committee. (Sai))

ఇప్పటికైనా దేవస్థానం పాలకవర్గం, ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయశాఖ వారు స్పందించి పొనుగుపాటి పాపరాజు గారిని వ్యవస్థాపక ధర్మకర్తగా గుర్తించి ఆలయ ఆవరణలో శిలా శాసనం వేయించుటకు తగిన చర్యలు తీసుకొనగలరని, సంబందిత పొనుగుపాటి వంశీయ వారసులను అనువంశిక ధర్మకర్తలుగా గుర్తించగలరని, అలాగే రాజా వాసిరెడ్డివెంకటాద్రి నాయుడు దేవాలయంకు య.22.00లు భూమి ఇనాంగా ఇచ్చినట్లు మరొక శిలాశాసనం వేయించగలరని ఆశించుచున్నాం.

పూర్వపు ఆలయంలో ప్రతిష్ఠించిన విగ్రహాలు 

దేవాలయం ప్రభుత్వ రికార్డు నందు శ్రీ అంజనేయస్వామి దేవస్థానంగా గుర్తించబడింది. ఈ దేవస్థానంలో శ్రీఆంజనేయ స్వామి మూల విగ్రహంతో పాటు, మరొక ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించ బడినవి.

ఈ ఆలయంలోనే  శ్రీ సీతా రామస్వామి దేవాలయం అను మరొక ఉపాలయం ఉంది. అందువలన గ్రామస్థుల వాడుకలో శ్రీరామాలయంగా వ్యవహరిస్తారు. ఈఉపాలయంలో శ్రీసీతారామలక్ష్మణ స్వామి ఏకశిల విగ్రహం ప్రతిష్ఠంచబడింది. శ్రీసీతారామలక్ష్మణస్వామి విగ్రహం ఎప్పుడు ప్రతిష్ఠించ బడిందో తెలియటానికి ఎటువంటి ఆధారం లేదు.మనం ఎక్కువుగా “రామాలయం లేని ఊరు ఊరే కాదు” అనే నానుడి  మన పెద్దవారు అంటుంటారు.

ఆ ఆలోచనతో తరువాత ఆలయ ధర్మకర్తలు గ్రామస్తుల సహకారంతో శ్రీ సీతా రామ లక్ష్మణ స్వామి వార్ల విగ్రహం ప్రతిష్ఠించి ఉండవచ్చు.శ్రీసీతా రామ లక్ష్మణ స్వామివార్ల ఏకశిలా విగ్రహంతో పాటు శ్రీఆంజనేయ స్వామి, శ్రీరామస్వామి, శ్రీ సీతాదేవి, శ్రీలక్ష్మణ స్వామి,ఉత్సవ విగ్రహాలు ఉన్నవి.

లక్ష్మీకాంతారావు ఆలయ ట్రష్టీగా పని చేసిన కాలంలో శ్రీ రామాలయం భజంత్రీలకు స్వంత భూమి డి.నెం. 102 రు లో య.2.00 లు ఇనాంగా ఇచ్చినట్లు రెవిన్యూ  లెక్కల రికార్డు ద్వారా తెలుస్తుంది.

గత చైర్మెనులుగా పని చేసిన వారు

వంశపారంపర్య ధర్మకర్తలు స్థానంలో తొలిసారిగా ఆలయ నిర్వహణకు దేవాదాయ శాఖ వారు 1987 జూన్ లో చట్టపరిధికి లోబడి పనిచేసే ప్రవేటు ట్రష్టు బోర్డును మొదటి సారిగా ఏర్పాటు  చేసారు. మొదటి  ట్రష్టు బోర్డులో సభ్యులుగా కొంగర జగన్నాధం, గుర్రం లక్ష్మణరావు, కట్టమూరి సుబ్బారావులతో నియమించారు.

మొదటగా నియమించిన ట్రష్టు బోర్డు చైర్మెనుగా కొంగర జగన్నాధం 1987 జూన్ మాసంలో  ప్రమాణస్వీకారం చేసి మూడు సంవత్సరంలు కొనసాగారు.ఆ తరువాత తిరిగి పై వారితోనే నియమించిన ట్రష్టు బోర్డుకు మరలా కొంగర జగన్నాధం చైర్మెన్ గా 1990 జూన్ లో ఎన్నికై   కొన సాగుచుండగా  1992 ఫిబ్రవరిలో ప్రభుత్వం  పొనుగుపాడు గ్రామ పరిపాలనాధికారిగా నియామకం చేసినందున చైర్మెన్ పదవికి రాజినామా ఇచ్చారు.

జగన్నాధం  చివరి వంశపారంపర్య ధర్మకర్తగా పనిచేసిన వెంకట రమణయ్యకు ముఖ్య సన్నిహితుడు. ఆ తరువాత దేవాదాయ శాఖ వారు 1997 జనవరి వరకు ఎటువంటి ట్రష్టు బోర్డును నియమించ లేదు. అయినప్పటికీ జగన్నాదం అనధికారంగా ఆలయ నిర్వహణ భాధ్యతలు నిర్వహించారు. 

ఆ తరువాత ది.03.01.1997 న పోట్లూరి లక్ష్మిపతి, బెల్లంకొండ వెంకయ్య, దాడి రాధాకృష్ణ, శ్రీమతి కొంగర శివకుమారి, కనమర్లపూడి జగన్నాధంలతో నియమించిన కమిటీకి దాడి రాధాకృష్ణ  చైర్మెనుగా ది.18.01.1997న ఎన్నికై ఒక సంవత్సరం పాటు పని చేసారు.

ఆ తదుపరి దేవాదాయ శాఖ వారు ది.17.12.2004 వరకు ఎటువంటి కమిటీని నియమించ లేదు. ఆ కాలంలో జగన్నాధం, రాదాకృష్ణ ఉభయులూ అనధికారంగా ఆలయ నిర్వహణ భాధ్యతలు నిర్వహించారు.ఇప్పటికీ వీరు పూర్తి కాలం దేవాలయం సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. జగన్నాధం, రాదాకృష్ణకు తోడు ఆలయ నిర్వహణ క్రోసూరి బాలరాజు, గుంటుపల్లి చంద్రమౌళి మరి కొంత మంది గ్రామ పెద్దల పర్వేక్షణలో జరిగింది.

ఎక్కువ కాలం పని చేసిన చైర్మెన్లు

దరిమిలా ది.23.11.2004న క్రోసూరి వెంకట్రావు, శ్రీమతి మాగులూరి సత్వవతి,కుంభా సుశీలరావు, తెలగతోటి చిన లక్ష్మయ్య, కట్టమూరి సుబ్బారావులతో నియమించిన ట్రష్టు బోర్డుకు చైర్మెనుగా క్రోసూరి వెంకట్రావు ది.18.12.2004న ఎన్నికై ది.25.04.2007 వరకు పని చేసారు.

మరలా ఆదే సభ్యులుతో ది.09.04.2007 న నియమించిన కమిటీకి క్రోసూరి వెంకట్రావు రెండవసారి ది.26.04.2007న చైర్మెనుగా ఎన్నికై జూన్ 2010 వరకు పని చేసారు. చైర్మెన్ హోదాలో ఉన్నప్పటికి ఆలయంనకు సంబంధించిన చిన్నపని, పెద్ద పని అనే తారతమ్యము లేకుండా తనే స్వయంగా చేసేవారు.

ఆ దరిమిలా ది.31.05.2010న  క్రోసూరి పున్నమ్మ (మాజీ ట్రష్ఠు చైర్మెన్ వెంకట్రావు భార్య), తెలగతోటి చిన లక్ష్మయ్య, శ్రీమతి మాగులూరి సత్యవతిలతో కమిటీ నియామకం జరిగింది. కమిటీ చైర్మెనుగా 2010 జూన్ లో పున్నమ్మ ఎన్నికై 2013 జూన్ వరకు కొనసాగింది.

ఈ కమిటీలో అదనంగా ఆలయ పూజారి శ్రీనివాస రాజగోపాలాచారిని ఎక్స్ అఫిషియో మెంబరుగా దేవాదాయ శాఖ వారు నియమించారు. తిరిగి అదే సభ్యులతో నిమించిన కమిటీ చైర్మెనుగా పున్నమ్మ 2013 జూన్ లో ఎన్నికై ఆగష్టు 2016 వరకు పని చేసారు.ఈమె చైర్మెనుగా కొనసాగిన కాలంలోనే జీర్ణోద్దరణ కార్యక్రమంనకు శంఖుస్థాపన  జరిగింది.

గతంలో పనిచేసిన పూజారులు, ఇ.ఓ లు

ఆలయ పూజారులుగా 1950 సంవత్సరంనకు ముందు నుండి చిలకపాటి అప్పలాచార్యులు, ఆయన కుమార్డు శ్రీనివాసాచార్యులు ఈ గ్రామంలోనే ఉండి చాలాకాలం అర్చకత్వం చేసారు. ఆ తరువాత  పెద్దింటి వెంకటాచార్యులు, కొంతకాలం వారి కుమారులు, ఆతదుపరి అగ్నిహోత్ర రంగాచార్యులు మరి కొంత మంది పని చేసారు.

ఈ దేవస్థానంను 1992లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో చేర్చబడినది. దేవాలయంనకు మొదటిసారి కార్య నిర్వహణాధికారిని ది.02.01.1992న నియనించింది. మొదటి కార్యనిర్వహణాధికారిగా ఆంజనేయులు అనువారు పనిచేసారు. వారి ఆ తరువాత కోటిరెడ్డి, సూర్యనారాయణ పనిచేసారు. 

దేవస్థానం ప్రస్తుత నిర్వహకులు

ప్రస్తుతం ఆలయ కార్యనిర్వహణాధికారిగా దుగ్గిరాల చిన వెంకటరెడ్డి 2005 నుండి పని చేయుచున్నారు. ప్రస్తుత పూజారిగా కొదమగండ్ల శ్రీనివాస రాజ గోపాలాచార్యులు జూన్ 1981 నుండి పని చేయు చున్నారు.

శ్రీవాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఆలయంనకు కైంకర్యంగా ఇచ్చిన య.22.50 సెంట్లు భూమిలో కాంప్రమైజ్ యాక్టు ప్రకారం నిత్య నైవేధ్య, దీపారాధన కార్యక్రమాలు నిర్వహించుటకు ప్రస్తుత పూజారికి య 6.00లు అనువంశిక మాన్యంగా ఇవ్వబడింది.

ప్రస్తుత ట్రష్టు బోర్డు చైర్మెను గుంటుపల్లి తులసీధరరావు ఆగష్టు  2016 నుండి వ్వవహరించు చున్నారు.

దేవాలయం పున:నిర్మాణం పూర్తి చేయబడి వీరి కాలంలో జీవధ్వజస్తంబం, నూతన విగ్రహాలు ప్రతిష్ఠాపన మహోత్సవం ది.03.05.2017 నుండి ప్రారంభించబడి ది.08.05.2017 తో జయప్రదంగా ముగిసింది.

ఈ దేవస్థానంలో పాంచరాత్ర ఆగమ విధానం ప్రకారం పూజలు జరుగుచున్నవి.  

సర్వేజనా:సుఖినోభవంతు

 

Check Also

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థులు భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల …

3 comments

 1. EXCELLENT RAMARAO BABAI , IT’S NOT EASY TO PUBLISH HISTIRY WITH EVIDENCES. HATS OFF TO YOUR EFFORTS.

 2. ధన్యవాదాలు మిష్టర్ పాపారావు

 3. Gadde Rama koteswara rao

  Good history record, sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *