జీవిత చరిత్ర.
రిటైర్డు ప్రొఫెసరు.
జననం. 30.06.1947. తల్లి తండ్రులు మస్తానురావు చౌదరి, నారాయణమ్మ. ముత్తాత కోటయ్య, తాతమ్మ పేరమ్మ. తాత పెద శేషయ్య, నాయనమ్మ ఆదెమ్మ.
పెద్ద సోదరులు శేషగిరిరావు, పాండురంగారావు. పెద్ద సోదరీమణులు కమలారత్నం, అనంతాదేవి. వీరి వివాహం ఫిరంగిపురం మండలం , అమీనాబాద్ గ్రామానికి చెందిన బిక్కి బాలకోటయ్య, కామేశ్వరమ్మ దంపతుల కుమార్తె నాగమల్లేశ్వరితో 06.06.1969 న జరిగింది.
వీరి సంతానం ముగ్గురు కుమారులు. శ్రీమహేష్ , శ్రీదరచంద్ర, శ్రీకాంత్. వృత్తిరీత్యా అందరు అమెరికా లో స్థిరపడినారు.ప్రభాకరరావు 1952 నుండి 1956 వరకు ప్రాధమిక విద్య హిందూ ప్రాథమిక పాఠశాల చదివారు.ఉన్నత పాఠశాల విద్య 1957 నుండి 1963 వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు.
గుంటూరు ఆంధ్ర క్రిష్టియన్ కళాశాలలో పి.యు.సి చదివారు. (1964).సెంట్రల్ హిందూ కళాశాల,కమచ్చా బెనారస్,హిందూ యూనివర్శిటీ,వారణాసి నందు ‘ ప్రీ మెడికల్ ‘కోర్సు చేసారు.(1965). ప్రస్తుత ఛత్తీస్ గడ్ రాష్ట రాజధాని రాయపూర్ లో ప్రభుత్వ కళాశాల నందు బి.యస్.సి., మరియు యం.యస్.సి., (రసాయనశాస్త్రం) చేసారు. (1965 -1970).
ప్రభాకరరావు ఉద్యోగ ఆరంగేట్రం.
మొదటిసారిగా శ్రీకాకుళం జిల్లా, పాలకొండ ప్రభుత్వ కళాశాలలో 11.02.1972 న జూనియర్ లెక్షరర్ (రసాయన శాస్తం) గా విధులలో చేరారు. ఆ తరువాత అసిస్టెంట్ ప్రొపెసరుగా పదోన్నతి పొంది శ్రీకాకుళం బదిలీ అయ్యారు.చివరగా డాక్టరు వాసిరెడ్డి శ్రీకృష్ణ ప్రభుత్వ డిగ్రీ, పోష్టు గ్రాడ్యేట్ కళాశాల, విశాఖపట్నంలో 1986 నుండి ఆర్గానిక్ కెమిష్ట్రీ సబ్జెక్టుపై డిగ్రీ, పోష్టు గ్రాడ్యేట్ విద్యార్థులకు ఉపన్యాసకులుగా చేసారు. అదే కళాశాలలో 30.06.2005న పదవీ విరమణ పొందారు.
1987 నుండి 99 వరకు ఆంద్రప్రదేశ్ గజిటెడ్ కాలేజి టీచర్స్ అసోసియేషన్ హైదరాబాద్ స్టేట్ కౌన్సిలర్ గా పని చేసారు.డాక్టరు బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీకి సుమారు 10 సంవత్సరాల పైగా అకడమిక్ కౌన్సిలర్ గా పనిచేసారు.అండర్ గ్రాడ్యేట్ విద్యార్థుల బోధనకు ఉపయోగపడే యస్.సి.ఇ.ఆర్.టి.రసాయనశాస్త్ర దృశ్య పాఠాలకు స్క్రిప్టు రైటరుగా పని చేసారు.కళాశాల పత్రిక ‘స్పందన’ కు ఎడిటర్, మరియు ఆర్టు ఎడిటరుగా పలు సంవత్సరాలు పని చేసారు.
స్పందన స్వాతి వాసంతి వారి కవిసమ్మేళనంలో, విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అధారిటి, కనక మహలక్ష్మి టెంపుల్ ట్రష్టు విశాఖపట్నం, నవయువ ఆర్ట్సు విజయనగరం వారిచే పురష్కారాలు పొందారు.
నాట్యరవళి,మ్యూజిక్,డ్యాన్సు అకాడమి విశాఖపట్నం వారిచే సాహిత్యంలో ఉగాది పురష్కారం పొందారు. ఇంకా లెక్కకు మిక్కిలి సన్మానాలు పొందారు. డాక్టరు వి.యస్.కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విశాఖపట్నం వారికి ‘లోగో’ ను ప్రభాకరరావు చేతుల మీదుగా తయారు చేసారు.
అంతేగాదు ప్రభాకరరావు చిన్నతనం నుండే తల్లిదండ్రులపై, తనకు చదువు చెప్పిన గురువులపై ఎంతో గౌరవభావం చూపించేవారు. ఇప్పటికీ గురువులను కలసి వారికి నూతన వస్త్రములతో సత్కరించి, వారి ఆశ్శీసులు పొందుట ఈరోజుల్లో చాలా గొప్పవిషయం. ప్రభాకరరావుపై కాసులనాటి గురునాధ శర్మ, కొత్త సత్యనారాయణ చౌదరి జిల్లా పరిషత్ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుల ప్రభావం ఉంది.అలాగే జమ్ములమడక మాదవరాయ శర్మ, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి, అధ్యాపకులు ఆంధ్ర క్రిష్టియన్ కళాశాల గుంటూరు వార్ల ప్రభావం ఎంతో ఉంది.
ప్రముఖ నాటక రచయిత

విద్యార్థి దశలోనే నాటకరంగంపై ఆసక్తి ఉంది.”ఆహుతి” నాటికను తన సహచరుడు సుంకుల రామాంజనేయులు రచించాడు. ఆనాటికలో విలన్ పాత్ర పోషించారు.
ఆ నాటిక 1967లో పొనుగుపాడులో ప్రదర్శించబడింది. ఈ నాటికలో కనపర్తి గ్రామానికి చెందిన నాతాని కోటేశ్వరరావు నాయక పాత్ర పోషించారు.
పసల ప్రాన్సిస్ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ నాటికలో కొరిటాల మురహరిరావు. కోయశ్రీహరిరావు. డా.యామాని వెంకట్రావు, షేక్ మొహిద్దీన్ పీరా, కొంగర నరశింహారావు నటించారు. కొరిటాల శేషగిరిరావు ప్రచార బాధ్యత వహించగా, నవయుగ నాట్యమండలి ద్వారా ప్రదర్శించబడింది.అప్పట్లో ఈ నాటిక పలుచోట్ల ప్రదర్శించబడి, ప్రజల మన్ననలు పొందింది.

ప్రభాకరరావు వృత్తిపరంగా కళాశాల అసిస్టెంట్ ప్రొపెసరు. ప్రవృత్తి పరంగా ప్రముఖ నాటక రచయిత, దర్శకుడు, నటుడు, కవిగా ప్రభాకరరావు పొందిన అవార్డులు అనేకం.
ప్రభాకరరావు గారి ఇంటిలో కొంత కాలం గ్రంధాలయం నిర్వహించారు.
దాని ప్రభావం వల్లనైతేనేమి, విద్యార్థి దశలోనే నాటకరంగంపై మక్కువ ఉండుట వల్లనైతేనేమి, గురువులు, తల్లిదండ్రుల ప్రభావం వల్లనైతేనేమి, ప్రభాకరరావు ఉద్యోగం చేసే సమయంలోనే ప్రవృత్తిగా పలు నాటికలు రచించారు.
కళాకారుడు, దర్శకుడు
ఆయన రచించటమేగాదు, కొన్ని నాటికలలో నటించారు. మరికొన్ని నాటికలకు దర్శకత్వం వహించారు. 2013 నంది అవార్డుల కోసం తను రాసిన ‘ ఇదీ ప్రశ్న… ఏది జవాబు ? అనే బాలల సాంఘిక నాటిక, ‘కురుక్షేత్రం’ శయన దృశ్యం ప్రభాకరరావు స్వీయ దర్శకత్వం లో ప్రముఖుల, ప్రజల మన్ననలు పొందినవి.
ఈ ఫొటో లోని సన్నివేశం”ఇదీ ప్రశ్న…ఏది జవాబు’ నాటికలోది. ఈ నాటిక విజ్ఞాన్ విద్యాలయం (హైస్కూలు) విశాఖపట్నం విద్యార్థులచే ప్రదర్శించబడింది.
ఆ నాటికలో తల్లిదండ్రులు, పిల్లల్నివారి అంతులేని ఆశలకు వారసుల్లా ఈ పోటీ ప్రపంచంలో రేసు గుర్రాల్లా పరుగు పెట్టిస్తూ వారిపై వత్తిడి పెంచి, వేధించడం ఎంత వరకు సబబు ? అనే సందేశం దాగుంది. చదువు పిల్లలకి ‘శిక్షణ’ లా వుండాలే గాని ‘శిక్ష’ లా ఉండకూడదు అని, పిల్లల బాల్యాన్నితల్లిదండ్రులు లాగేసుకునే హక్కు ఎవరిచ్చారు ? అనే సందేశంతో నాటిక ముగుస్తుంది.
నటించిన, దర్శకత్వం వహించిన ముఖ్య నాటికలు
ప్రభాకరరావు నటించి, దర్శకత్వం వహించిన కొన్ని ముఖ్యనాటికలు.
విష వలయం, ఓ మనిషీ ఏది నీ గమ్యం, ఈనాడు, నాలుగు స్తంబాలాట, మంచం మీద మనిషి, కళ్యాణ వసంతం మొదలగునవి. ‘ చందమామరావే ’ నాటిక రాష్ట వ్యాప్తంగా ఎన్నో నాటక పరిషత్ ల నందు ప్రదర్శింపబడింది. ఈ నాటిక శ్రీ ఓంకార్ నాట్య కళాసమితి, గొల్లల మామిడాడ, తూర్పు గోదావరి జిల్లా బాలికలచే ప్రదర్శించబడింది.
ఈ కురుక్షేత్రం (శయన దృశ్యం) నాటిక ఉత్తమ రచన, ఉత్తమ నటి, ఉత్తమ సహాయనటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ బాల నటుడు, ఉత్తమ దర్శకత్వం అవార్డులు గెలుచుకుంది.
వంకర టింకర ‘ శొ “నాటిక 2006 లో విజయవాడ సుమధుర కళా పరిషత్ లో ప్రదర్శించబడి, ఉత్తమ నూతన హాస్యరచన పురష్కారం పొందింది. ప్రభాకరరావుచే రచించిన నాటికలలో ఎక్కువ ప్రజాదరణ పొందిన నాటికలు.
ప్రజాదరణ పొందిన వాటికలు
చందమామరావే, ఓ క్షణం ఆగితే, సౌందర్యం, గెలుపు నాదే, ఓంకర టింకర శొ, ఇది ఓదారి, ఇక్కడ వరుడు అమ్మబడును, గంతలు, ఊయల, ఓ విజేత, నిశబ్దం, ఏదయా! మీదయా! , ప్రేమ ఎంత మథురం, మొదలగునవి.
‘ఓ క్షణం ఆగితే ‘ నాటిక 2003లో, ‘గంతలు’ అనే నాటిక 2008 లో, అప్పాజోస్యుల విష్ణుబొట్ల ఫొండేషన్, నాటక ఉత్సవాలకు ఎంపికై ప్రదర్శించబడి, ముద్రింపబడ్డాయి.
ప్రభాకరరావు రచించబడిన ‘నిశబ్దం’ నాటిక 2011లో హైదరాబాదు, రవీంద్రబారతిలో ప్రదర్శించడి ఉత్తమ రచనగా ఎంపికైనది.
మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి చేతుల మీదుగా ‘సావిత్రి అవార్డు’ తో పాటు, మరో మూడు బహుమతులు గెలుచుకుంది.ప్రభాకరరావు రచించి, దర్శకత్వం వహించిన బాలల సాంఘిక నాటిక ’ ఓ విజేత ‘2010 లో నంది నాటకోత్సవాలకు ఎంపికై నంద్యాలలో ప్రదర్శింపబడింది.
నిశ్సబ్దం నాటిక 2011లో తాడేపల్లిగూడెం జాతీయ నాటక పరిషత్ పోటీల్లో ఉత్తమ రచన, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, ఉత్తమ ద్వితీయ నటన అవార్డులు పొందింది.
పరుచూరి రఘు నాటక పరిషత్ వారు పల్లెకోనలో నిర్వహించిన పోటీల్లో స్పెషల్ జ్యూరీ అవార్డు పొందింది.
ప్రముఖులతో పరిచయాలు
రావు బాలసరస్వతి, కొండవలస లక్షణరావు, అశోక తేజ, పోసాని మొదలగు సినీ, రంగస్థల ప్రముఖులతో ప్రభాకరరావుకు పరిచయాలు ఉన్నవి.
కలలు కనే మనసు నాటిక ప్రతిని ప్రముఖ రచయిత, దర్శకుడు, చిత్రకారుడు బాపు చదివారు.
గులాబిరంగు మేఘాల్లో నెలవంకపై కలలు కంటున్న కథానాయికి ముఖ చిత్రాన్ని చిత్రించి, స్వదస్తూరితో ప్రభాకరరావు చిరునామా రాసి పంపుట ఎంతైనా గర్వించ తగిన విషయం.
పొనుగుపాడులో గ్రామదేవతగా పిలువబడుచున్న పోలేరమ్మ విగ్రహం ఎటువంటి గుర్తింపు లేకుండా, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంది.పరిస్థితులను గమనించి, ప్రభాకరరావు, సోదరులు శేషగిరిరావు, పాండురంగారావులు అదనంగా స్థలం సమకూర్చి పోలేరమ్మ గ్రామదేవతకు దేవాలయం నిర్మించారు.