మస్తానురావు చౌదరి జీవిత చరిత్ర
మస్తానురావు చౌదరి జననం:1911. తండ్రి శేషయ్య(పెద), తల్లి ఆదెమ్మ. ఈ దంపతులకు ఏకైక కుమార్డు మస్తానురావు చౌదరి
వీరి శేషయ్య (ముత్తాత), రమణమ్మ (తాతమ్మ). కోటయ్య (తాత). పేరమ్మ (నాయనమ్మ).
మస్తానురావు చౌదరి ప్రాధమిక విద్యాభ్యాసం, ఉన్నత పాఠశాల విద్య ఫిరంగిపురంలో చదివారు. వివాహం గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలం, లింగరావుపాలెం గ్రామానికి చెందిన కట్టా రామయ్య, అనంతమ్మ దంపతుల కుమార్తె నారాయణమ్మతో 1929 సంవత్సరంలో జరిగింది.మస్తానురావు చౌదరి, నారాయణమ్మ దంపతుల సంతానం కమలారత్నం,శేషగిరిరావు, పాండురంగారావు, అనంతాదేవి, ప్రభాకరరావు.
వీరి తోబుట్టువులు ఏడుగురు. రత్తమ్మ, రాధమ్మ, శ్యామమ్మ , పూర్ణమ్మ, భాగ్యమ్మ, కోటమ్మ, నారాయణమ్మ. అందువలన ఈ కుటుంబ వారసులకు ఇప్పటికీ చుట్టిరికం బలగం ఎక్కువగా ఉంది.
వివాహ సందర్బంగా తీసిన గ్రూపు ఫొటో
మస్తానురావు చౌదరి, నారాయణమ్మ దంపతుల వివాహ సందర్బంగా తీసిన చిత్రం.
మస్తానురావు చౌదరి తల్లి దండ్రులు శేషయ్య (పెద), ఆదెమ్మ హయాంలో సుమారు 70 ఎకరాల ఆస్థి ఉండేది. తోబుట్టువుల ఏడుగురు వివాహాది కార్యక్రమాలు జరిపినందుకు కొంత ఆస్థి తరిగింది. అయినప్పటికి మస్తానురావు చౌదరి హయాంలో సుమారు 50 ఎకరాల ఆస్థి ఉండేది.
పూర్వం గ్రామాలలో వివాహాలు ఐదు రోజుల కార్యక్రమాలతో చాలా సందడిగా జరిగేవి. వారం రోజుల ముందే బంధువులు అందరూ వచ్చేవారు. ఇల్లంతా సందడి, సందడిగా ఉండేది. మస్తానురావు చౌదరి, నారాయణమ్మ దంపతులు ఇద్దరూ విద్యను గౌరవించే వ్యక్తులు. దానికి నిదర్శనం. పంటలపై ఫలసాయం అంతంత మాత్రం వచ్చే ఆరోజుల్లో, విద్యను గౌరవించి తన సంతానం అందరిని కష్టపడి చదివించారు.
కొరిటాలవారి కుటుంబాలలో ముఖ్యమైన వక్తి
కొరిటాలవారి కుటుంబాలలో మస్తానురావు చౌదరి. నారాయణమ్మ దంపతులును ఇప్పటికీ ముఖ్యమైన వ్యక్తులుగా గుర్తుంచుకుంటారు. ఈరోజు మస్తానురావు చౌదరి ముగ్గురు కుమారులు శేషగిరిరావు, ప్రభాకరరావు విద్యారంగంలో రాణించారు. పాండురంగారావు పి.యచ్.డి చేసి, దేశ విదేశాలలో ఉన్నత పదవులు నిర్వహించి పదవీ విరమణ చేసారు.
తిరిగి వారి ముగ్గురి కుమారుల సంతానం ఉన్నత చదువులు చదివి, వృత్తి రీత్యా అందరూ అమెరికాలో ఉన్నారు. దీనిని బట్టి మనకు మస్తానురావు చౌదరి, నారాయణమ్మ దంపతులు విద్యను గౌరవించే వ్యక్తులు అని తెలుస్తుంది. అంతేకాదు సమాజంను గౌరవించే వ్యక్తులు. అ కాలంలో ప్రజలు అజ్ఞానంలో ఉండటానికి కారణం సరియైన లోకజ్ఞానం తెలుసుకొనక పోవటమేనని గ్రహించారు. ఆ లోటును తీర్చుటకు కంకణం కట్టుకున్న వ్యక్తులు.
గ్రంధాలయం పున:ప్రారంభం
1922 ఆ ప్రాంతంలో పొనుగుపాటి అప్పయ్య (పంతులు), రాయంకుల వెంకయ్య (పంతులు) మరి కొంతమంది కొన్ని పుస్తకాలతో శ్రీ విశ్వేశ్వర పుస్తక భాండాగారం పేరుతో లోగడ స్థాపించిన గ్రంధాలయం సరిగా నిర్వహణ లేక మరుగున పడింది. 1931 లో గ్రంధాలయ ఉధ్యమంలో భాగంగా పొనుగుపాటి వెంకట నాగ భూషణం (ప్రీడం ఫైటరు), పొనుగుపాటి జానికి రామయ్య, మస్తానురావు చౌదరి కలసి మరికొన్ని పుస్తకాలు సేకరించి మరుగున పడిన శ్రీ విశ్వేశ్వర పుస్తక భాండాగారంను “శ్రీ శారదా గ్రంధాలయం” అనే పేరుతో పున:ప్రారంభించారు.
వెంకట నాగభూషణం సహకారంతో వారి సోదరుడు కరణం రమణయ్య (పొనుగుపాటి) అధీనంలో నున్న సత్రంలో ( గ్రామ చావడి అని కూడ పిలుస్తారు) గ్రంధాలయం ఏర్పాటు చేసారు.
గ్రంధాలయ నిర్వహణ సక్రమంగా సాగుటకు అధ్యక్షుడుగా మస్తానురావు చౌదరి, జానికిరామయ్య గౌరవ కార్యదర్శిగా, శ్రీపతి నరశింహాచార్యులు (అప్పటి ఆంజనేయ స్వామి దేవాలయ పూజారి) గౌరవ భాండాగారిగా వ్యవహరించారు.గ్రంథాలయం సాఫీగా నడుచుటకు ప్రతి సభ్యుడు నెలకు అప్పటి చలామణిలో నున్న రెండు అణాలు (ఒక రూపాయకు 16 అణాలు) చందా చెల్లించే పద్దతిపై నిర్ణయించి నడిపారు.తన ప్రమేయం లేకుండా సత్రంలో గ్రంధాలయం ఏర్పాటు చేయుట కరణం రమణయ్య నచ్చలేదు.
సాఫీగా నడుపుచున్న సమయంలో తన అధీనంలో నున్న కచేరి చావిడి తాళం పగలగొట్టి అక్రమంగా ప్రవేశించారని సత్తెనపల్లి కోర్టులో క్రిమినల్ కేసు పెట్టాడు.
తన తమ్ముడు వెంకట నాగ భూషణంను తప్పించి మస్తానురావు చౌదరి, జానికి రామయ్య, పూజారి శ్రీపతి నరశింహాచార్యులు ముగ్గురిపై మాత్రమే నేర పిర్యాదు చేసాడు. కరణం వేంకటరమణయ్య ఆ సమయంలో అంజనేయస్వామి దేవస్థానం ట్రష్టీగా ఉన్నారు. పూజారి నరశింహాచార్యులను బెదిరించి నేరం చేసినట్లుగా ఒప్పించి సాక్షం చెప్పించాడు.
జరిమానా చెల్లించిన చౌదరి
కోర్టు విచారించి ఒక్కొక్కరు 25/-లు జరిమానా మరియు కోర్టు లేచే వరకు నిర్బంద శిక్ష విధించింది. జరిమానా చెల్లించి సాయంత్రం కోర్టు ముగించే వరకు శిక్ష అనుభవించారు.
తరువాత వెంటనే వెంకట నాగభూషణంకు చెందిన ఖాళీగా నున్న మట్టి మిద్దెలోకి గ్రంధాలయంను మార్చారు.
కొంత కాలానికి వెంకట నాగభూషణం మట్టిమిద్దె అమ్మారు.తిరిగి మరలా గ్రంథాలయం ఎక్కడ పెట్టాలనే సమస్య ఏర్పడింది. మస్తానురావు చౌదరి వెంటనే ఇక కాదులే అని వారి ఇంట్లో పెట్టించారు.
స్వంత ఇంట్లో గ్రంధాలయం నిర్వహణ
మస్తానురావు చౌదరి సతీమణి నారాయణమ్మ కృషి వలన గ్రంథాలయం వారి ఇంట్లోకి మార్చబడినది.
అప్పటి నుండి పాఠకుల సంఖ్య పెరిగి ప్రతి రోజు సాఫీగా సాగింది.దీని వెనుక ఈ దంపతుల కృషి ఎంతో ఉంది.
పాఠకులు చదివి కొన్ని విషయాలపై చర్చించుకుంటూ వారు చేసే ఎంత గోలనైన నారాయణమ్మ సహించేది.
ఆమె కూడా పుస్తకాలు చదివి ఆ చర్చల్లో పాల్గొనేది. 1937 లో గ్రంధాలయంను రిజిష్టరు చేయించారు. 1940 లో గ్రంధాలయంనకు స్వంత భవనం ఏర్పడే వరకు మస్తానురావు చౌదరి ఇంట్లోనే సజావుగా సాగింది.
సమాజంను గౌరవించే దంపతులు
అంతే కాదు గ్రంధాలయంనకు అనుబంధంగా శ్రీ శారదా నాట్య మండలిని స్థాపించారు. నాటకాలు ద్వారా గ్రామీణ జనపథంలో సంస్కారభావాల్ని, సామాజిక చైతన్యాన్ని కలుగ చేసారు. నాటకాలను ఉత్తమ సాధనాలుగా ఉపయోగించి ఆరోజుల్లోనే వితంతు వివాహాలు, కులాంతర, మతాంతర వివాహాల సంస్కరణలకు నడుం బిగించారు.
అలాంటి నాటకాలు వ్రాయించి అయ్యంకి వెంకట రమణయ్య, పాతూరి నాగ భూషణం, గుర్రం జాషువా, ఈడ్పుగంటి వెంకట రత్నమాంబ వంటి మొదలగు ఎందరో ప్రముఖులను రావించి వారి సమక్షంలో ప్రదర్శించారు.
ప్రదర్శించిన నాటికలు
శారదా నాట్య మండలికి మస్తానురావు చౌదరి డైరక్టరుగా కొనసాగారు. వీరి డైరక్షన్ లో సంఘసంస్కరణ, పాదుకా పట్టాబిషేకం, వివాహవిచ్చేదం, కనకతార, రంగూన్ రౌడి, పల్నాటియుద్దం పలు నాటికలు ప్రదర్శించారు. పల్నాటియద్దం లో నరసింగరాజు పాత్రను పోషించారు.
మస్తానురావు చౌదరి తృతీయ కుమార్డు ప్రభాకరరావు తండ్రికి వారసత్వంగా నాటకరంగం కళను పోషించే వ్యక్తి. ప్రముఖ నాటక రచయిత, దర్శకుడు, నటుడు. పలు సన్మానాలు అవార్డులు పొందారు.
ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, లోగడ తరంవారికి చిరపరిచితుడు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులుగా 1955నుండి 1967 వరకు పనిచేసిన కీ.శే.వావిలాల గోపాల కృష్ణయ్య వీరికి ఆప్త మిత్రుడు.
1930-1940 మధ్య కాలంలో గ్రామఫోను, మోటారు సైకిలు వంటి అప్పటి ఆధునిక పరికరములు గ్రామ ప్రజలకు పరిచయం చేసారు. చాలాకాలం ఎడ్ల పందాలు నిర్వహించారు.
ప్రయాణ వసతులు సరిగా లేని ఆకాలంలో గుర్రపు స్వారీ చేసే వారని ప్రతీతి.
మస్తానురావు చౌదరి 1963 లో తనువు చాలించారు.
మహా మాన్విత నారాయణమ్మ
ఈ దంపతుల వివాహం జరిగే నాటికి నారాయణమ్మ వయసు పదునాలుగు సంవత్సరంలు. మస్తానురావు చౌదరి వయసు పదునెనిమిది సంవత్సరంలు.
నారాయణమ్మ తక్కవ చదువు మాత్రమే చదువుకున్నది. అయినప్పటికి సామాజిక సేవలో భర్తకు తోడు నీడై ఆదర్శ గృహిణిగా వెలుగొందిన మహామాన్విత.
గ్రామాభ్యుదయానికి, విద్యోదయానికి మార్గదర్శకులుగా దంపతులు ఇద్దరూ పేరొందారు.భర్త మస్తానురావు చౌదరి ఏబది రెండు సంవత్సరంల వయసులో అకాల మరణం చేసారు. (1963).
భర్త ఆశయం మేరకు పరిస్థితులతో రాజీ పడకుండా ముగ్గురు కుమారుల చదువులకు అంతరాయం లేకుండా ఉన్నత చదువులు చదివించారు.
నారాయణమ్మ జీవిత ప్రయాణంలో తొంబై దశకంలో పడి సహస్ర చంద్రోదయ దర్శన భాగ్యం లభించిన సందర్బంగా కుమారులు, కుమార్తెలు, అరుదుగా జరిగే “సహస్ర చంద్ర దర్శన సన్మానం” ను 13.03.2006 న ఈమెకు చేసారు.
ప్రతి మాతృమూర్తికి ఇలాంటి సన్మానాలు జరిపే అవకాశం వారి సంతానానికి కలగాలని భగవంతుని కోరదాం
నారాయణమ్మకు అదే సందర్బంలో బంధువులు, గ్రామ పౌరులు సన్మానించుట విశేషం.
నారాయణమ్మ 92 సంవత్సరంల జీవిత ప్రయాణం సాగించి 13.08.2006 న తనువు చాలించారు.